బాలీవుడ్ ఇండస్ట్రీలో కరణ్ జోహర్ దర్శకనిర్మాతగా ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు నిర్మించారు, కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే నెపోటిజమ్‌ని బాగా ఎంకరేజ్ చేస్తారనే అపవాదు ఆయనపై ఉంది. వారితోనే ఎక్కువ సినిమాలు చేస్తారనే విమర్శలు కూడా ఉన్నాయి. బాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల పిల్లలను హీరోలుగా లాంచ్ చేసేందుకే ఎక్కువ ఇష్టపడతారంటారు. ఇంతకుముందు పెద్ద స్టార్స్‌తో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించిన కరణ్‌కి లెక్కకు మించిన ఫ్లాప్స్ తగలడంతో ఆ ప్రయత్నం మానుకొని కొత్తవారితో, కొత్త తరహా సినిమాలు చేస్తున్నారు.
ఆ క్రమంలోనే గత ఏడాది ‘కిల్’ సినిమా చేశారు. అది కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. హలీవుడ్‌లో దీన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓటీటీలో ఇప్పటికీ ‘కిల్’ టాప్ పొజిషన్‌లో ఉంది. ఇంతకుముందు హాట్‌స్టార్‌లో హిందీలో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉండేది. ఆ తర్వాత అన్ని భాషల్లోకి డబ్ చేశారు. ముఖ్యంగా తెలుగు, తమిళ్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఓటీటీలో బాగా ఆదరిస్తున్నారని తెలిసింది.
‘కిల్’ చిత్ర నిర్మాణం వెనుక జరిగిన కొన్ని ఆసక్తికర విశేషాలను నిర్మాత కరణ్ జోహర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. మొదట ఈ కథను బాలీవుడ్‌లోని టాప్ హీరోలకు చెప్పారట. వారిలో ఒక హీరో రూ.40 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని కరణ్ తెలిపారు. తన సినిమా బడ్జెట్ రూ.40 కోట్లయితే.. హీరో రెమ్యునరేషన్ అంత ఎలా ఇవ్వగలను. అందుకే కొత్తవారితో చేశానని చెప్పారు. దీని గురించి డైరెక్టర్ జోయా అక్తర్ మాట్లాడుతూ ‘రెమ్యునరేషన్లు ఇంతగా పెరిగిపోవడానికి నువ్వేగా కారణం. భారీగా ఇవ్వడం మొదలు పెట్టావు. దాన్నే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు’ అన్నారట. ఈ విషయంలో తనదే తప్పని ఒప్పుకున్నారు కరణ్. ఏ హీరో అయినా తనకు ఉన్న ఇమేజ్, మార్కెట్‌ని బట్టే రెమ్యునరేషన్లు తీసుకోవాలని కరణ్ హితవు పలుకుతున్నారు.